- డేంజర్ కెమికల్స్‌తో ఐస్‌క్రీములు
- ఐస్‌క్యాండీ, లస్సీ కేంద్రంపై పోలీసుల దాడులు
- రూ.5.44 లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ కమిషనర్ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఫస్ట్ లాన్సర్ అహ్మద్‌నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ముషారుద్దీన్(24) ఐస్ క్రీమ్ పార్లర్ పేరిట కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.
నిబంధనలకు విరుద్ధంగా, అపరిశుభ్ర పరిస్థితుల్లో ఐస్ క్యాండీలు, లస్సీ తయారు చేస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 16,560 ఐస్ క్యాండీలు, 4,200 లస్సీ క్యాండీలు, 300 లస్సీ గ్లాసులు, 15 బకెట్ల పెరుగు, 50 కిలోల చక్కెర, లస్సీ మిషన్, ఐస్ క్యాండీ మిషన్, ప్యాకింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు, 8 కిలోల సిట్రిక్ యాసిడ్, 500 గ్రాముల సుక్రోజ్‌తో పాటు వివిధ ఫ్లేవర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
హానికర రసాయనాలతో, అపరిశుభ్ర వాతావరణంలో తయారీ జరుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు కేంద్ర నిర్వాహకుడు సయ్యద్ ముషారుద్దీన్‌ను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
